నేను రబ్బర్ స్టాంప్ కాదు. సీఎం చెబితే వినాల్సిన అవసరం లేదు. కేబినెట్ నిర్ణయాలకు గుడ్డిగా ఓకే చెప్పను.. ఇది స్థూలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై తేల్చిచెప్పిన విషయం. కేసీఆర్ సర్కారు, గవర్నర్ మధ్య వివాదం ముదిరిపాకాన పడుతున్న సందర్భంలో ముచ్చటగా మూడోసారి.. అదీ తెలంగాణ బయట గవర్నర్ తమిళి సై మరోసారి భద్రకాళి అవతారం ఎత్తారు. తగ్గేదేల్యా,.. అంటూ కనుబొమ్మలు ఎగరేశారు. నేను తల్చుకుంటే సర్కారు కూలిపోయేదని కూడా వ్యాఖ్యనించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని గవర్నర్ ఖండించినా ఈ వివాదం నేపథ్యంలో గవర్నర్ వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కొందరు అనుకూలంగా వాదిస్తే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే.. ఙక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు మాత్రం తావు లేదన్నది విస్పష్టం. గవర్నర్ వ్యవస్థ గురించి, గవర్నర్ బాధ్యతల గురించి రాజ్యాంగం విస్పష్టంగా వెల్లడిస్తోంది. విచక్షణ అధికారాలు అన్న ఒక్క క్లాజే గవర్నర్ కు విస్తృతమైన అధికారులను కల్పిస్తోంది. ఈ నిబంధనను ఏ విధంగా ఉపయోగించనున్నారు… ఎందుకు ఉపయోగించనున్నారు? అన్నదే ముఖ్యం.
అయితే.. చిక్కల్లా గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లగా వ్యవరించినప్పుడే సమస్యలు వస్తున్నాయి. సర్కారియా కమిషన్ చెప్పినట్లుగా.,. గవర్నర్‌తో పాటు రాష్ర్ట ప్రభుత్వాల మధ్య మరింత స్పష్టమైన విభజన జరిగినప్పుడే ఈ వివాదానికి తెరపడనుంది. తెలంగాణ విషయానికి వస్తే గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. అదే సమయంలో ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగా విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు మంచిదికాదు. ఎవరి అధికార పరిధిని వారు గుర్తెరిగి మసలుకుంటేనే పురోగతి సాధ్యమవుతుంది.