హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో రసవత్తర పోటీ నెలకొంది. విమర్శలు, ప్రతి విమర్శల నడుమ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికారి పార్టీ నుండి మొదలుకుని ప్రతిపక్ష పార్టీల వరకు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో పోటీ పడుతున్నాయి. అటు దళిత బంధు పథకం ఇప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల కోసమే పథకాన్ని తెచ్చారంటూ కొందరు, దళిత బంధుని రాష్ట్రమంతా అమలు చేయాలని మరొకరు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడ్డంకి దయాకర్ మాట్లాడుతూ, అటు ఎన్నికల కమీషన్, ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పట్లో ఉండదని చెబుతుంటే, ఇప్పుడే అభ్యర్థులు, పథకాల గురించి మాట్లాడుతున్నారని, అసలు పథకాలు ప్రజల కోసం తీసుకొచ్చారా? లేదా ఎన్నికల కోసం తీసుకొచ్చారా? అంటూ కామెంట్లు చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుబట్టారు. ఎన్నికలు వచ్చినపుడే పథకాలు గుర్తొస్తాయా అంటూ అడ్డంకి దయాకర్ ప్రశ్నించారు.