ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నారాయణ (మాజీ మంత్రి) వివాదంలో ఈ మాట ఘాటుగా వినిపిస్తుండడంతో వైసీపీ సర్కారు తనంతట తానే దీనిని ఒప్పుకుంది. ఓ విధంగా తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించి సంచలనం అయ్యారు.అయితే ఆయనేమీ ప్రస్తుత సీఎం కాదు..అలానే ప్రజా ప్రతినిధి కూడా కాదు. నేరం పరిశోధనలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశామని వైసీపీ చెప్పడం ఓ విధంగా సమర్థనీయమే ! కానీ ఈ కేసు ను ఎంత వరకూ ముందుకు తీసుకువెళ్లి నిరూపించగలరో అన్నది కూడా చూడాలిక.
ఏదేమయినప్పటికీ టీడీపీ మాత్రం ఇరకాటంలో పడిపోయింది. సోషల్ మీడియా వర్గాలు గతంలో జరిగిన తప్పిదాలు అన్నింటినీ వెలికి తీస్తున్నా, నారాయణ పై ప్రజల్లో ఉన్న కోపాన్ని అంతగా తగ్గించలేకపోతోంది. విద్యను వ్యాపారం చేసిన సంస్థలలో నారాయణ ఒకటి, చైతన్య ఒకటి ముందు వరుసల్లో నిలిచాయని మండిపడుతోంది. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏకపక్షంగా వ్యవహరించి, అమరావతిలో అన్నీ తానై నడిపారన్న వాదనను కూడా ఇప్పుడు వైసీపీ బలంగా వినిపిస్తుండడంతో..
ఓ విధంగా ఇవాళ వైసీపీ తన పట్టు మరింత పెంచింది. ల్యాండ్ పూలింగ్ లో జరిగిన వివాదాలు, పరీక్ష ప్రశ్న పత్రం లీకులో జరిగిన అవకతవకలు ( నేరుగా కానీ పరోక్ష రీతిలో కానీ) ఓ విధంగా నారాయణ అనే వ్యక్తి ప్రతిష్టను మరోసారి దిగజార్చాయి. ఉమ్మడి ఆంధ్రాలో 90ల కాలంలో వెలుగు చూసిన ఇటువంటి ప్రశ్న పత్రాల లీకేజీలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావడం, మళ్లీ అలాంటి ఉదంతాలే నమోదు కావడం విద్యార్థి వర్గాల్లో కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నారాయణ అరెస్టు, బెయిల్ అన్నవి ఎలా ఉన్నా కూడా ఈ కేసులో జగన్ తన పంతం నెగ్గించుకునే క్రమంలో మరిన్ని సాక్షాధారాలు నమోదు చేయించేందుకు దర్యాప్తు వర్గాలకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.
మరోవైపు అమరావతికి సంబంధించిన వివాదంలో దర్యాప్తు బృందాలు తమ పని వేగవంతం చేస్తే ల్యాండ్ పూలింగ్ తగాదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా చిత్తూరు పోలీసులు ప్రశ్న పత్రం లీకేజీ పై కూడా దృష్టి సారించి మరిన్ని వివరాలు సేకరించి, కోర్టుకు సమర్పిస్తే ఓ విధం అయిన స్పష్టం అయిన సమాచారం వెలుగు చూడక తప్పదు. అయితే నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లనున్నామని సజ్జల చెప్పడంతో ఈ కథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనంలో నైతిక విజయం మాదేనని ఇంకోవైపు విజయ సాయిరెడ్డి కూడా అంటుండడం ఈ కథలో కొసమెరుపు.