కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు- 2025 పార్లమెంట్లో గట్టెక్కింది! లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజు, గురువారం అర్థరాత్రి రాజ్యసభ సైతం దీనికి ఓకే చెప్పింది. రాష్ట్రపతి సంతకం తరువాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. అయితే ఈ బిల్లును కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
దాదాపు 12 గంటల పాటు రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు పై తీవ్ర చర్చ జరిగింది. అర్థరాత్రి జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. తుది సంఖ్యలు దిద్దుబాటుకు లోబడి ఉన్నాయని చైర్మన్ జగదీప్ ధన్కర్ తెలిపారు. రాజ్యసభ బిల్లును ఆమోదించడంతో ఇప్పుడు అధికారికంగా పార్లమెంట్ ఆమోదం పొందింది. చట్టంగా మారడానికి ముందు తుది ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. ముసల్మాన్ వక్ఫ్ బిల్లు 2024 కూడా రాజ్యసభలో వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు ఈ బిల్లుపై రాజ్యాంగ విరుద్ధం, మత స్వేచ్ఛ పై దాడి అని పేర్కొన్నాయి.