తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న పేరు బాగా ఫేమస్! తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరిని తన వైపు తిప్పుకోవడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యారనే చెప్పాలి. క్యూ న్యూస్లో ఉదయం మల్లన్న దినపత్రికల్లో వచ్చిన కథనాలను రివ్యూ చేస్తుంటే కొన్ని వేల మంది ఆ కార్యకమ్రాన్ని చూసేవారు. ప్రధానంగా యువత ఆయన ప్రసంగాలతో ఉర్రూతలూగేది! అయితే అది గతం… ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాదు – బీజేపీ కమలన్న!
అవును… ప్రధాని మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన టీం ప్రకటించింది. అయితే మొదటి నుంచి తీన్మార్ మల్లన్న వెనుక బీజేపీ ఉందనే ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ మల్లన్న.. కమలన్నగా మారిపోయారు! ఇదే సమయంలో… రిమాండ్ లో ఉన్న తన భర్తను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను మల్లన్న సతీమణి మమత మెయిల్ ద్వారా కోరారని తెలుస్తోంది.
ఆసంగతి అలా ఉంచితే… అసలు మల్లన్న బీజేపీలోనే ఎందుకు చేరారు? అన్న ప్రశ్న ఆన్ లైన్ వేదికగా మొదలయ్యింది! నిత్యం రాజ్యాంగ నియమాల గురించి మాట్లాడే మల్లన్నను అంతగా ఆకర్షించిన మోడీ సిద్దాంతం ఏమిటి? కేవలం టీఆరెస్స్ ను ఒంటరిగా ఎదుర్కోలేకే మల్లన్న బీజేపీలో చేరుతున్నారా? లేక, నిజంగానే మానిటైజేషన్ (ప్రైవేటైజేషన్) వంటి మోడీ సిద్ధాంతాలకు – తాజాగా మోడీ చేసిన వ్యవసాయ చట్టాలకు మల్లన్న ఆకర్షితులయ్యారా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి!
ఉదయం లేస్తే… రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ – కాన్షీరాం లను గుర్తుచేసుకుంటూ సాగిన మల్లన్న కెరీర్ ఇప్పుడు కమళం గూటికి ఎలా చేరగలిగింది? వంటి ప్రశ్నలే కాకుండా… ముఖ్యంగా కాన్షీరాం రాజకీయాల్ని నిత్యం ప్రచారం చేసిన మల్లన్న.. బీజేపీలో చేరడంపై పలు విమర్శలు కూడా ఆన్ లైన్ వేదికగా దర్శనమిస్తున్నాయి. మరి జైలు నుంచి విడుదలయిన తర్వాత తమపై వస్తున్న విమర్శలకు మల్లన్న సమాధానం ఇస్తారా లేక రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు సహజమే అని సర్ధుకుని కాషాయ కండువా కప్పుకుంటారా అన్నది వేచి చూడాలి.
– CH Raja