కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ అమ్మేస్తుందనడం అబద్దమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఎక్స్ లో చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారనే విషయం తన దృష్టికి రాగానే 48 గంటల్లో వారిని తిరిగి నియమించామని తెలిపారు.
సెప్టెంబర్ 27న తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను 29న మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని తెలిపారు. స్వప్రయోజనాలు, ఓటు బ్యాంకు, రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం మానేయాలని సూచించారు కుమార స్వామి. ఇప్పటివరకు రద్దు చేసిన 3,700 మంది కాంట్రాక్ట్ లేబర్ పాస్ లను ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా త్వరలో అప్ డేట్ చేస్తామని RINL యాజమాన్యం ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. కార్మికుల బయో మెట్రిక్ ను కూడా త్వరలోనే అప్ డేట్ చేస్తామని వెల్లడించారు మంత్రి కుమార స్వామి.