బంగాల్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. మరో టీఎంసీ ఎమ్మెల్యే ఇళ్లు, ఫ్యాక్టరీలపై ఐటీ అధికారులు చేసిన దాడుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం రూ.11కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి, టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్ హొస్సేన్ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.
బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము 3.30 గంటల వరకు కోల్‌కతా, ముర్షిదాబాద్‌లోని దాదాపు 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. జాకీర్ ఇళ్లు, ఆయన బీడీ ఫ్యాక్టరీ, నూనె మిల్లు, రైస్‌మిల్లుల్లో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలను ఐటీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.11కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ముర్షిదాబాద్‌లోని మరో రెండు బీడీ తయారీ యూనిట్లలోనూ రూ.5.5కోట్ల నగదును గుర్తించారు. అయితే ఈ యూనిట్లు ఎవరివన్నది అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం లెక్కల్లో చూపించిన ఆదాయమా లేదా అన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.