మెగా కృష్ణారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌..

మెగా ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన‌ట్టు తెలుస్తోంది. మెగా గ్రూప్ కంపెనీలకు చెందిన అన్ని కార్యాల‌యాల‌పైన‌, హైద‌రాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ ప్రాంతంలో ఉన్న మెగా కృష్ణా రెడ్డి ఇంట్లోనూ ఈ ఇన్‌కం టాక్స్ అధికారులు ఏక‌కాలంలో సోదాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 30 చోట్ల హైదరాబాద్‌లో నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌, జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని కార్యాలయం, ఎంసీహెచ్‌ ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మెగా కృష్ణారెడ్డి మెగా గ్రూప్ కంపెనీస్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ భారీ ఎత్తున ప్రాజెక్టుల‌ను చేప‌ట్టారు. ఈ దాడుల్లో అణువ‌ణువును వ‌ద‌ల‌కుండా క్షుణ్ణంగా త‌నిఖీలు చేస్తున్నార‌ట‌. గ‌త కొంతకాలంగా మెగా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో అక్ర‌మ ఆర్థిక‌ కార్య‌క‌లాపాల‌పై పిర్యాదులు అంద‌డంతో ఐటీ అధికారులు మెగాగ్రూప్‌పై ఓ క‌న్నేసి ఉంచారు. ప్ర‌స్తుతం ఈ సంస్థ‌కు సంబంధించిన కంపెనీల కార్యాల‌యాల్లో ఐటీ అధికారులు ముమ్మ‌రంగా త‌నీఖి చేస్తున్నారు.