జస్టిస్ ఎన్వీ రమణ మీద ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణల మీద నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయ వ్యవస్థ ను అప్రతిష్టపాలు చేసే నిరాధార ఆరోపణలు చేశారని అందుకే ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ని ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. ఈ రోజు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది. ముగ్గురు న్యాయవాదులు జి.ఎస్. మణి, ప్రదీప్ కుమార్ యాదవ్, ఎస్.కే. సింగ్ సంయుక్తంగా ఈ పిటిషన్ వేశారు.
మనీలాండరింగ్, అవినీతికి సంబంధించిన 20కి పైగా తీవ్ర నేరారోపణ కేసులు న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేశారన్నది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. న్యాయ వ్యవస్థ ను అప్రతిష్టపాలు చేసే రీతిలో, సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పై యధేచ్ఛగా తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కి రాసిన లేఖ పై ఏపీ ముఖ్యమంత్రి నుంచి వివరణ కోరాలని పిటిషనర్లు అభ్యర్ధించారు. ఈ విషయంలో ఈ ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది.