వైసీపీ – టీడీపీ మంత్రుల ఫిక్సింగ్ పాలిటిక్స్‌కు జ‌గ‌న్ చెక్‌…!

-

గ‌త కొన్నేళ్లుగా ఆ జిల్లాలో పార్టీల‌తో సంబంధం లేకుండా ఓ కులం వాళ్లే రాజ‌కీయం న‌డిపిస్తుంటారు. జిల్లాలో ఆ కులం వాళ్ల ప‌ట్టు పోకుండా ఉండాల‌ని.. పార్టీల‌తో సంబంధం లేకుండా వాళ్లే రాజ‌కీయాలు చేసుకుంటూ వ‌చ్చారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా అక్క‌డ అదే రాజ‌కీయం న‌డుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఫిక్సింగ్ పాలిటిక్స్‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెక్ పెట్టేశారు. సిక్కోలులో దివంగ‌త మాజీ మంత్రి ఎర్ర‌న్నాయుడు, ధ‌ర్మాన సోద‌రుల మ‌ధ్య ఇవే ఫిక్సింగ్ పాలిటిక్స్ న‌డుస్తాయ‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది.

 

వీరిది వెలమ సామాజిక వ‌ర్గం. జిల్లాలో వెల‌మ‌ల క‌న్నా కాలింగ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌.  వీరు ముందుకు రాకుండా ఎప్పుడూ త‌మ రెండు కుటుంబాల‌దే పెత్త‌నం ఉండేలా ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు చేసుకుంటూ వ‌చ్చారు. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా ధ‌ర్మాన, ఎర్ర‌న్న కుటుంబాలు స‌హ‌క‌రించుకుంటూ వారు మాత్రం గెలిచేలా ప్లాన్ చేసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఈ రెండు కుటుంబాల‌పై ఉన్నాయి. 1999లో ఏపీలో టీడీపీ గెలిస్తే ధ‌ర్మాన ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఎర్ర‌న్న సోద‌రులు ఇద్ద‌రు ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ స్వీప్ చేస్తే అచ్చెన్న ఎమ్మెల్యేగా, రామ్మోహ‌న్ నాయుడు ఎంపీగా గెలిచారు. ఈ గెలుపుల వెన‌క ఈ రెండు కుటుంబాల మ‌ధ్య వెల‌మ అండ‌ర్ స్టాండింగే అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో రామ్మోహ‌న్ నాయుడుపై పోటీ చేసిన దువ్వాడ శ్రీను కేవ‌లం 4 వేల ఓట్ల‌తో మాత్ర‌మే ఓడిపోయారు. ధ‌ర్మాన ప‌రోక్షంగా రామ్మోహ‌న్ నాయుడుకు స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్లే జిల్లా అంత‌టా క్రాస్ ఓటింగ్ జ‌రిగి రామ్మోహ‌న్ గెలిచాడ‌న్న‌ది జిల్లా ఓపెన్ టాక్‌..?

దువ్వాడ‌తో పాటు టెక్క‌లిలో పోటీ చేసిన పేరాడ తిల‌క్ కూడా ఓడిపోయారు. వీరిద్ద‌రు కాళింగ వ‌ర్గం నేత‌లే. ఎన్నిక‌ల త‌ర్వాత ఈ ఫిక్సింగ్ పాలిటిక్స్‌పై జ‌గ‌న్‌కు ఫిర్యాదులు వెళ్ల‌డం కూడా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డానికి ఓ కార‌ణం అంటారు. దీంతో ఇప్పుడు ధ‌ర్మాన సోద‌రులు ఇద్ద‌రూ కింజార‌పు ఫ్యామిలీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ రెండు కుటుంబాలు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దూరంగా కేవ‌లం పార్టీల‌పై మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చేవారు.

ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన షాక్‌తో ధ‌ర్మాన సోద‌రులు అచ్చెన్న‌, రామును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అటు అచ్చెన్న‌, రాము సైతం మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌తో పాటు ఇత‌ర నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ దెబ్బ‌తో ఈ రెండు కుటుంబాల ఫిక్సింగ్ పాలిటిక్స్‌కు అయితే తెర‌ప‌డింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version