ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్ట్ ఇచ్చే తీర్పుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తప్పించడంపై పలు పిటీషన్ లు హైకోర్ట్ లో దాఖలు అయ్యాయి. రమేష్ కుమార్ కూడా దీనిపై పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై హైకోర్ట్ విచారణ జరుపుతుంది. ఏపీ ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి తుది అఫిడవిట్‌ను హైకోర్టుకు సమర్పించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని, రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వం ఇందుకు గానూ గవర్నర్ ఆమోదం తో ఒక ఆర్డినెన్స్ కూడా రూపొందించిందని తెలిపింది. రమేష్ కుమార్ ఆరోపణలపై కూడా స్పందించింది.
2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికలలో 221 హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపిన ప్రభుత్వం… 2020లో 88 ఘటనలు జరిగాయని తెలిపింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం ఆరోపించింది. పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు కూడా అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రస్తావించింది. అయితే నిమ్మగడ్డ విషయంలో హైకోర్ట్ ఇచ్చే తీర్పు గనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం… జగన్ సర్కార్ ఇబ్బందుల్లో పడినట్టే.