పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పదవి కోసం పెద్ద రాజకీయాలే నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్‌రెడ్డి తర్వాత ఆ పదవి ఎవరికి దక్కుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో అయితే నేనంటే నేనంటూ అందరూ పోటీపడుతున్నారు. ఈ పోటీలో జగ్గారెడ్డి కూడా ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే తనకు పీసీసీ చీఫ్ పదవిపై ఉన్న మమకారాన్ని జగ్గారెడ్డి బయట పెట్టారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయట్లేదని, తాను ఒకవేళ పీసీసీ చీఫ్ అయి ఉంటే అలా ప్రభుత్వమే చేయలేని ఎన్నో పనుల్ని చేసేవాడినని చెప్పారు జగ్గారెడ్డి.
ప్రస్తుతం తన తల్లిదండ్రుల గుర్తుగా ఉస్మానియా.. గాంధీ ఆసుపత్రుల వద్ద రెండేసి చొప్పున మొత్తం నాలుగు అంబులెన్సుల్ని జగ్గారెడ్డి ఉచితంగా ఏర్పాటు చేశారు. పేదోళ్లు వీటిని వాడుకోవాలని చెప్పారు. తనను కానీ పీసీసీ చీఫ్ చేస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇదే తరహా అంబులెన్సుల్ని ఏర్పాటు చేసే వాడినంటూ వెల్లడించారు.