తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తైందో లేదో…మంగళవారం నుంచి వాటి పరిశీలన ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా.. జగిత్యాల నుంచి తెరాస తరుఫున పోటి చేస్తోన్న సంజయ్ కుమార్ నామినేషన్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. నామినేషన్ సమయంలో సంజయ్ కుమార్ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కానీ వాటిల్లోని ఏ ఒక్క సెట్ పత్రాల్లోనూ కాలమ్-5 నింపలేదు. నామినేషన్ పత్రాల పరిశీలనలో ఈ విషయం గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్క కాలమ్ నింపకపోయినా నామినేషన్‌ను తిరస్కరించాలనే నిబంధన ఉందని పేర్కొంటూ.. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తెరాస అభ్యర్థి సంజయ్ నామినేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అసలే తెరాస – మహాకూటమి మధ్య తీవ్ర పోరు నడుస్తున్న సమయంలో టెక్నికల్ కారణాలతో నామినేషన్ రద్దు చేస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి.