కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులూ ఎక్కడికీ వెళ్లలేకపోయిన పర్యాటకులకు జమ్మూ కాశ్మీర్ స్వాగతం పలుకుతోంది. మంగళవారం నుంచి అక్కడ టూరిజంకు దశలవారీగా మళ్లీ అనుమతులు ఇస్తున్నట్లు అక్కడి కేంద్ర పాలిత అధికారులు తెలిపారు. అయితే జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మొదటి దశలో కేవలం వాయు మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే అక్కడ అనుమతి ఇవ్వనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో దిగగానే పర్యాటకులకు ముందుగా ఆర్‌టీ పీసీఆర్ కరోనా టెస్టులు చేస్తారు. అవి చేయించుకోవడం కూడా అక్కడ తప్పనిసరి.
జమ్మూకాశ్మీర్‌కు రావాలనుకునే వారు ముందుగానే అక్కడి హోటళ్లలో రూంలను బుక్ చేసుకోవాలి. అవి కన్‌ఫాం అయి ఉండాలి. అదే ప్రూఫ్‌లను పర్యాటకులు రాగానే అక్కడ చెక్ చేస్తారు. అలాగే అక్కడికి వెళ్లేవారు ముందుగానే రిటర్న్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకుని ఉండాలి. అక్కడ అడుగు పెట్టిన వారి దగ్గర రిటర్న్ టిక్కెట్లు ఉన్నాయో, లేవో కూడా చెక్ చేస్తారు. ఇక ఎయిర్‌పోర్టుల నుంచి హోటల్స్‌కు, హోటళ్ల నుంచి పర్యాటక ప్రదేశాలకు, తిరిగి ఎయిర్‌పోర్టులకు కావల్సిన రవాణాకు గాను పర్యాటకులు ముందుగానే ట్యాక్సీలు లేదా ఇతర రవాణాను బుక్ చేసుకోవాలి. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వస్తే వారే పర్యాటకులకు అక్కడ రవాణా సదుపాయం కల్పిస్తారు.
జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం శాఖ అక్కడ అందుబాటులో ఉండే హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీల వివరాలను పర్యాటకులకు ముందుగానే తెలియజేయనుంది. 65 ఏళ్లు పైబడిన టూరిస్టులకు అక్కడికి అనుమతి లేదు. కోవిడ్ 19 టెస్టు నెగెటివ్ వస్తే ఓకే.. లేదా పాజిటివ్ వస్తే చికిత్స తీసుకోవాలి. ఇక రిజల్ట్ వచ్చేందుకు 24 గంటల సమయం పడుతుంది కనుక.. అప్పటి వరకు ప్రయాణికులు తాము బుక్ చేసుకున్న హోటల్ రూంలోనే ఉండాలి.
పర్యాటకులు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ను తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడాలి. అందులో వారి స్టేటస్ సేఫ్ ఉందా, లేదా అనే వివరాలను అధికారులు చెక్ చేస్తారు. పర్యాటకులు అక్కడ దిగగానే ఈ వివరాలను కూడా తనిఖీ చేస్తారు. దీంతోపాటు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇన్ని నిబంధలను పాటిస్తేనే అక్కడ పర్యాటకులకు అనుమతి ఉంటుంది.