జమ్ముకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఎన్సీ పార్టీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి రాజకీయ కుట్రలు చేయొద్దని అన్ని పార్టీలను కోరారు. ‘మేం విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. జమ్ముకశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం కాసేపట్లో తెలుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలి. ప్రజల తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి కుయుక్తులకు పాల్పడవద్దు. కాషాయ పార్టీ ఎలాంటి కుట్రల్లో భాగం కావొద్దు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, గండేర్బల్,బుడ్గామ్ నుంచి పోటీచేసిన ఒమర్ అబ్దుల్లా రెండు చోట్లా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే,జమ్ముకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగగా మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలలోపు జమ్ముపీఠాన్ని ఏ పార్టీ అధిరోహించబోతున్నది స్పష్టంగా తేలనుంది. ప్రస్తుతం ఎన్సీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భాజపా 25, కాంగ్రెస్ 11, పీడీపీ- 5, స్వతంత్రులు 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.