జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్ల చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎక్కడోచోట ఎదురుకాల్పులు జరగుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా చెర్దారిలో ఆర్మీ, పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరగపడటంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు తిరిగి జరిపిన కాల్పుల్లో కుల్గాంకు చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ వానీ హతమయ్యాడు. ఘటన స్థలం నుంచి ఒక పిస్టల్, లోడెడ్ మాగ్జిన్, గ్రానెడ్ ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

హతమైన ఉగ్రవాది జావేద్ అహ్మద్ వానీ గతంలో కాశ్మీర్ లో సాధారణ పౌరులను చంపిన మరో ఉగ్రవాది గుల్జార్ కు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. గుల్జార్ వాన్ పో ప్రాంతంలో గతంలో ఇద్దరు బీహారీ కార్మికులను చంపాడు. కాగా ఈనెల 20న గుల్జార్ ను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. తాజాగా ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మరో ఉగ్రవాది వానీ కూడా హతమయ్యాడు. ప్రస్తుతం మరణించిన ఉగ్రవాది కాశ్మీర్ లో హైబ్రిడ్ టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.