బిజెపి-జనసేన పొత్తు ఖరారు, విజయవాడలో 16 న అగ్రనేతల భేటీ…!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత ఒక్కసారిగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి పవన్ రాగానే కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలో జనసేన, బిజెపి నేతలు సమావేశం కానున్నారు. ఈ నెల 16 ఈ సమావేశం జరగనుంది. బిజెపి అగ్రనేతలతో పవన్ భేటీ తర్వాత ఈ సమావేశం జరగడంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఢిల్లీలో బిజెపి అగ్ర నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ప్రభుత్వంపై పోరాడే విషయంలో రెండు పార్టీలు కూడా కలిసి ముందుకి వెళ్ళే విధంగా అడుగులు వెయ్యాలని జెపి నడ్డాతో కలిసి పవన్ కళ్యాణ్ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది.

విజయవాడ గేట్ వీ లో జరుగుతున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అమరావతి రైతుల సమస్యలపై, ప్రభుత్వ మూడు రాజధానుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే బిజెపి రాష్ట్ర పార్టీ కూడా రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనితో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.