ఇక కలిసే యుద్ధం చేస్తాం, తేల్చేసిన నేతలు…!

-

విజయవాడలో జనసేన-బిజెపి నేతలు సమావేశమయ్యారు. జనసేన నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరు కాగా, బిజెపి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పురంధరేశ్వరి, ఎమ్మెల్సి సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో,

రెండు పార్టీలు ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని మీద నేతలు చర్చలు జరిపారు. దాదాపు మూడు గంటా పాటు ఈ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు, రాజధాని అంశం గురించి ఏ విధంగా ముందుకి వెళ్ళాలి అనే దాని మీద నేతలు చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దిపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.

కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిణామాలపై చర్చించామని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ పోకడలో వెళ్తుందని కన్నా అన్నారు. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేయడానికి అంగీకారం తెలిపారని, దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. బిజెపితో కలిసి పని చేయడానికి జనసేన ముందుకి వచ్చింది అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జనసేన-బిజెపితోనే సాధ్యమన్నారు.

రాష్ట్రంలో ఇక సమస్యలపై కలిసి పోరాడతామని కన్నా అన్నారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్, మనస్పూర్తిగా పొత్తుతో ముందుకి వెళ్తున్నామని, ఆంధ్రప్రదేశ్ కి బిజెపితో చాలా అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతికి అవకాశం లేని పాలన అందిస్తామని అన్నారు. తాను గత రెండు మూడు నెలల నుంచి నేతలతో చర్చలు జరిపి సమాచార లోపం లేకుండా ముందుకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

ఈ పొత్తు స్థానిక ఎన్నికల నుంచి కూడా కొనసాగుతుందని అన్నారు. కుటుంబ పాలనను అంతం చేయడానికి రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. బిజెపి జనసేన భావజాలం ఒకటే అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ నాడు రాజధాని విషయంలో తాను అభ్యంతరాలు తెలిపా అని, ఇంత పెద్ద రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఆ రోజే చెప్పా అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో పాలెగాళ్ళ రాజ్యం నడుస్తుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. సుస్థిరమైన పాలన అందిస్తామని అన్నారు. ప్రజాసమస్యలపై కలిసి పోరాడతామని స్పష్టం చేసారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కలిసి ముందుకి వెళ్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news