స్పెషల్ కోర్ట్, ఢిల్లీ కోర్ట్, సుప్రీం కోర్ట్, మళ్ళీ ఢిల్లీ కోర్ట్, మళ్ళీ స్పెషల్ కోర్ట్ ఇలా గత నాలుగు నెలల నుంచి నిర్భయ దోషుల ఉరితీత విషయంలో అనేక మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. నిర్భయ దోషులను ఈ నెల ఉరి తీసేందుకు గాను ఢిల్లీ కోర్ట్ డెత్ వారెంట్ కూడా జారి చేసింది. మళ్ళీ క్షమాభిక్ష పిటీషన్ గురించి వార్తలు వచ్చాయి. అయినా సరే ఇప్పుడు వాళ్ళ ఉరి తీత ఆగలేదు.
దీనితో నిర్భయ దోషుల్లో భయం స్పష్టంగా కనపడుతుంది. కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు ప్రాణ భయంతో బతుకుతున్నారు. ఒక్కరు కూడా నిద్రపోవడం లేదని తీహార్ జైలు అధికారులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ అయితే నిద్రపోకుండా క్రమం తప్పకుండా నడుస్తూనే ఉన్నాడని అధికారులు అంటున్నారు. తన సెల్ లో అసలు గత నాలుగు రోజుల నుంచి నిద్రపోలేదట.
ఇక ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులను కూడా కలవడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదట. ఎప్పుడు కలుస్తారని అడిగినా సరే ఏ సమాధానం రాకపోవడంతో ఉరి తీసే ముందు రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ రోజు వారికి ఇష్టమైన భోజనాన్ని వండి తీసుకొచ్చే సదుపాయం కూడా ఉంటుంది. జైలు అధికారుల సమక్షంలోనే వారు ఆ ఆహరం తింటారు.
ఇప్పటికే జైల్లో వాళ్ళు ఈ ఏడేళ్ళుగా సంపాదించిన మొత్తం ఒక లక్షా 37 వేలని అధికారులు చెప్తున్నారు. ఆ సొమ్ము మొత్తం కుటుంబ సభ్యులకు ఉరి తీసిన తర్వాత ఇస్తారు. వాళ్ళను ఉంచిన సెల్ లో నిత్యం సీసీటీవీ ఫూటేజ్ ద్వారా వాళ్ళ కదలికలను పసిగడుతున్నారు. వాళ్ళు ఉండే గదిలో కనీసం ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు. ఇక వారి మానసిక పరిస్థితి గురించి రోజు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.