అందరూ ఊహించిందే జరగబోతోందా ? గత రెండు నెలల నుంచి ఊరిస్తో వస్తోన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పేస్తున్నారా ? ప్రస్తుతానికి ఆయన ఆ వార్తలు ఖండిస్తున్నా బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆయనతో టచ్‌లోకి వెళ్లిపోయారా ? అంటే బీజేపీ వర్గాల్లో వినిపిస్తోన్న చర్చల ప్రకారం అవుననే ఆన్సర్లు వస్తున్నాయి. గత రెండు రోజులుగా లక్మీనారాయణ బీజేపీలోకి వెళ్లిపోతున్నారని.. పవన్‌కు షాక్ ఇస్తున్నారని ఒక్కటే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్తలపై శనివారం సాయంత్రం ఆయన క్లారిటీ ఇస్తూ తాను జనసేనలోనే ఉంటానని చెపుతున్నా… బీజేపీ అధిష్టానం నుంచి మాత్రం ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు ఆయన చివర్లో అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఆయన గెలుస్తారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. చివరకు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే లక్ష్మీనారాయణ జనసేనలో ఇమడ లేకపోతున్నారని… ఆయన దారి ఆయన చూసుకుంటారని… ఆయన్ను పార్టీలోకి తీసుకుని కీలక పదవి ఇవ్వడం ద్వారా బీజేపీ జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకం చేయాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు ఇదే నిజం కాబోతుందని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ తో పాటుగా జనసేన మరో కీలక నేత..తాజా ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి పోటీ చేసిన గంపల గిరిధర్ సైతం ఆయనతో పాటు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక లక్ష్మీనారాయణకు ఎన్నికలకు ముందు జగన్ కేసులను విచారించిన స్ట్రిక్ట్ అధికారిగా మంచి పేరుంది. ఆయనే సొంత పార్టీ పెడతారన్న టాక్ వచ్చింది.
ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసి రైతులతో పాటు చాలా మందిని మీట్ అయ్యారు. అనూహ్యంగా అందరికి షాక్ ఇచ్చి ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక పవన్ ఆయనకు పెద్దగా ప్రయార్టీ ఇచ్చినట్టు కనపడడం లేదు. తాజాగా పవన్ నియమించిన పార్టీ పాలిట్ బ్యూరో, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీల్లోనూ ఆయనకు అవకాశం దక్కలేదు. ఇక దేశవ్యాప్తంగా మోడీ క్రేజ్ పెరుగుతోన్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లడమే సరైందని నిర్ణయించుకున్న ఆయన ఆ పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఆఫర్‌తో జనసేనకు బై చెప్పేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారట.