నా దేవుడిని కలిసే అవకాశం కల్పించండి.. కేంద్రాన్ని కోరిన ట్రంప్‌ అభిమాని!

-

తెలంగాణ రాష్ట్రం జనగామకు చెందిన ఓ వ్యక్తి తనకు తన దేవుడిని కలిసే అవకాశం కల్పంచాలంటూ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. వింతగా అనిపిస్తుండా? దేవుడిని కలువాలనుకోవడం ఏంది, పైగా దేవుడిని కలిసే అవకాశం కల్పించమని కేంద్రప్రభుత్వాన్ని కోరడం ఏంది అనుకుంటున్నారా? అవునండీ.. మీరు చదువుతున్నది నిజమే. మీ సందేహాలకు సమాధానం కావాలంటే వార్తలోకి వెళ్దాం.

 

అసలు విషయం ఏందంటే.. జనగామకు చెందిన బుస్స కృష్ణ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు వీరాభిమాని. ఎందుకో తెలియదు కానీ, ట్రంప్‌ అంటే కృష్ణకు చచ్చేంత ప్రేమ. ట్రంప్‌ను ఆయన దేవుడిలా ఆరాధిస్తాడు. అందుకే ఆయన తన ఇంటిముందు ఒక షెడ్‌ను నిర్మించి, అందులో ట్రంప్‌ విగ్రహం పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేస్తాడు. ట్రంప్‌ నిండా నూరేండ్లు జీవించాలని కోరుకుంటూ ప్రతి శుక్రవారం ఉపవాస దీక్ష కూడా చేస్తాడు. అందుకే ఊరి జనం అంతా బుస్స కృష్ణను ట్రంప్‌ కృష్ణ అని పిలుస్తారు.

ఇదిలావుంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ పర్యటన సందర్భంగా తనకు ఆయనను కలిసే అవకాశం కల్పించాలంటూ బుస్స కృష్ణ కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. ‘ట్రంప్‌ నాకు దేవుడు. నేను ఎక్కడి వెళ్లినా ఆయన ఫొటో వెంబడే ఉంటుంది. ఏ పని అయినా ఆయన ఫొటోకు దండం పెట్టుకుని మొదలుపెడుతాను. భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడాలని రోజూ ట్రంప్‌ విగ్రహానికి పూజలు చేస్తున్నా. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నా. ఇప్పుడు ఆయన మన దేశానికి వస్తుండంటంతో ప్రత్యక్షంగా కలువాలని కోరుకుంటున్నా’ అని బుస్స కృష్ణ.. సారీ ట్రంప్‌ కృష్ణ చెబుతున్నాడు.

కేంద్రప్రభుత్వం తప్పకుండా ట్రంప్‌ను కలువాలన్న తన కలను నెరవేరుస్తుందని కృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణ స్నేహితులు కూడా అతను ట్రంప్‌ను దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తాడని చెప్పారు. అంతగా ఆరాధించే కృష్ణకు ఒక్కసారి ట్రంప్‌ను కలిసే అవకాశం ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి కేంద్రప్రభుత్వం కృష్ణ కలను నెరవేరుస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ కోసం మరో రెండుమూడు రోజులు వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news