భారత్‌గా దేశం పేరు మార్చడం తప్పు కాదు.. జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

-

దేశం పేరు మార్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లోనే ఇండియా పేరును భారత్‌గా మార్చే తీర్మానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అనే పేరు కూడా ఉందని గుర్తు చేశారు.

JD Laxminarayana aiming for Vizag Lok Sabha seat in 2024 elections?

ఇండియా అనే పేరు బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన పేరు అన్నారు. విదేశీయులు తెచ్చిన పేరును తీసేసి, మనం మన పేరు పెట్టుకుందామనే ఆలోచన కావొచ్చునన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చడం తప్పేమీ కాదన్నారు. ఇండియా నుండి భారత్‌గా పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని స్పష్టం చేశారు. అయినా ఈ పేరు మార్పు వల్ల అసలు సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మనం కూడా ఇప్పటి వరకు చాలా పట్టణాల పేర్లు మార్చామని, మద్రాస్‌ను చెన్నైగా, బొంబాయిని ముంబైగా, కలకత్తాను కోల్‌కతాగా ఇలా పలు నగరాల పేర్లు మార్చినట్లు తెలిపారు. అలాగే మన దేశం పేరు కూడా మారుస్తున్నారేమో అన్నారు. ఇండియా స్థానంలో భారత్ పేరు మార్చితే అప్పుడు ఆర్బీఐ, ఎయిమ్స్, ఐఐటీ, ఐపీఎస్, ఐఏఎస్ పేర్లు కూడా మార్చవలసి ఉంటుందన్నారు. వీటిలో ఇండియా అనే పేరు ఉందని గుర్తు చేశారు. అయినా పేరు మార్పుపై చర్చలు జరుగుతున్నాయని, పేరు ఏది మారినా దేశంలోని సమస్యలను దూరం చేయడం అసలు లక్ష్యం కావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news