గుంటూరులో జిన్నా టవర్ కొత్త యుద్ధానికి నాంది పలకక ముందే శాంతియుతంగా సామరస్య పూర్వక ధోరణిలో సమస్యను పరిష్కరించేందుకు మేయర్ తో పాటు అక్కడి ఎమ్మెల్యేలు చొరవ చూపారు. దీంతో జిన్నా టవర్ కు జెండా రంగులు వేయడంతో పాటు మత సామరస్యానికి ప్రాధాన్యం ఇచ్చేందుకు తీసుకునే ఏ చర్యకు అయినా తాము మద్దతుగా ఉంటామని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తో సహా మరికొందరు మత పెద్దలు ముందుకువచ్చారు. ఆ వివరం ఈ కథనంలో!
శాంతిమంత్రం ఉపదేశించడం తేలిక పాటించడం కష్టం. శాంతి శాంతి అనడంలో ఏ విధం అయిన కష్టంలేదు కానీ శాంతి స్థాపన నుంచి పునః స్థాపన వరకూ చేయాల్సినవి ఎన్నో! చేయకూడనివీ ఎన్నో! కనుక ప్రేమ శాంతి అన్నవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ద్వేషం యుద్ధం అన్నవి పక్కపక్కనే అంటిపెట్టుకుని ఉంటాయి. ప్రేమిస్తే శాంతి స్థాపన సులువు. ద్వేషిస్తే యుద్ధం ఇంకా సులువు. యుద్ధం కోరుకుని సాధించేదేమీ లేదు కానీ ప్రేమ పూర్వక శాంతి అన్నది మనుషులకు సాంత్వన ఇస్తుంది.
అందుకే యుద్ధం వద్దు అని శాంతి మాత్రమే కావాలని కోరుకోండి. ఎప్పటివో వివాదాలు బీజేపీ తవ్వినంత సులువుగా ఎవ్వరూ తవ్వరు. తవ్వలేరు. అందుకే గుంటూరు లోజిన్నా టవర్ ను తొలగిస్తాం అంటూ బీజేపీ నానా రాద్ధాంతం చేస్తుంది. అస్సలిప్పుడు ఎందుకీ వివాదం. ఇన్నాళ్లూ లేని వివాదం ఇప్పుడెందుకు వచ్చింది. ఇవేవీ ఆలోచించకుండానే బీజేపీ అధినాయకత్వం ఏం చెబితే అది పాటిస్తాం అన్న విధంగా కార్యకర్తలు ఉన్నారా?
మొన్నటి రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ జాతీయ జెండా ఎగురవేసేందుకు కొందరు బీజేపీ నాయకులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఆ తరువాత వివాదాన్ని పోలీసులే తగ్గించారు కూడా! తాజాగా జిన్నా సెంటర్ లో టవర్ కి త్రివర్ణ శోభను కల్పించారు. జెండాలో ఉండే రంగులను టవర్ కు వేశారు. అంతేకాదు స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ నెల 3న జాతీయ జెండా ఎగురవేసేందుకు నిర్ణయించారు.దీంతో వివాదం సర్దుమణగనుంది.
అంతేకాదు ఇందుకు అక్కడి మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తమవంతు బాధ్యత నిర్వర్తించి గొడవలు లేకుండా చేశారు. నగర వాసుల అభిప్రాయాలు తీసుకున్నాక, మత పెద్దలతో సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్ హాజరయి తమ అభిప్రాయాలు చెప్పారు. జీఎంసీ కమిషనర్ నిశాంత్ కుమార్ సమావేశానికి నేతృత్వం వహించారు. దీంతో వివాదం ఇప్పటికైతే ఆగింది. ఇక బీజేపీ వాళ్లు ఏమంటారో?