జియోకు భారీ షాక్… తగ్గిన యూజర్లు..

టెలికమ్యూనికేషన్ రంగంలో జియో ఓ సంచలనం. జియో రావడానికి ముందు, వచ్చిన తర్వాత అన్న రేంజ్ లో టెలికాం రంగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం డాటాకే బిల్లు చెల్లించండి… కాల్స్ ఉచితంగా చేసుకోండి అంటూ ప్రజలను ఆకర్షించింది. దీంతో పెద్ద ఎత్తున యూజర్లు ఇతర నెట్ వర్క్ ల నుంచి జియోకి మారారు. జియో దెబ్బకు పెద్ద కంపెనీలు అయిన ఏయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ వంటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏకంగా జియోను తట్టుకునేందుకు ఐడియా, వొడాఫోన్ లు సంయుక్తంగా జట్టు కట్టి వీఐ పేరుతో మార్కెట్ లోకి వచ్చాయి.

అలాంటిది జియోకు యూజర్లు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో దాదాపు 1.9 కోట్ల యూజర్లు రిలయన్స్ జియోను వీడారు. వారంతా ఇతర నెట్ వర్క్ లకు మారారు. అదే సమయంలో 2.74 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లను ఏయిర్ టెల్ సొంతం చేసుకుంది. జియోతో పాటు వొడాఫోన్ ఐడియాను కూడా 10.7 లక్షల మంది యూజర్లు వీడారు. సెప్టెంబర్ నెలలో ఏయిర్ టెల్ 0.08 శాతం కొత్త యూజర్ బేస్ నిలుపుకోగా.. జియో మైనస్ 4.29 శాతం తగ్గింది.