పోరాట యోధుడి ప్రమాణస్వీకారం రేపే

-

అమెరికాలో ఎన్నికల తేదీ దగ్గర నుంచి కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం వరకు అన్నింటికీ ప్రత్యేక తేదీలు ఉన్నాయి. దాని ప్రకారం..బైడెన్‌ ప్రమాణస్వీకారం..జరగాల్సిన తేదీ జనవరి 20.అంటే రేపు ఉదయం పదకొండున్నరకు.. మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభోపన్యాసం అనంతరం డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత బైడెన్ వైట్ హౌజ్‌కు వెళ్తారు. నాలుగు ఏళ్లపాటు అదే ఆయన నివాసం, కార్యాలయం.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రిహార్సల్స్ జరగాల్సి ఉన్నా, భద్రతాపరమైన ఆందోళనలతో వాటిని వాయిదా వేశారు. కాపిటల్ భవనం అల్లర్ల కారణంగా వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయ్యేదాకా ఇది కొనసాగనుంది. అధ్యక్షుడి భద్రత వ్యవహారాలు చూసుకునే సీక్రెట్ సర్వీస్ విభాగమే ఈ కార్యక్రమ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. నేషనల్ గార్డ్‌కు చెందిన 15 వేల మంది సిబ్బంది, వేల మంది పోలీసు అధికారుల సేవలను కూడా ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. సంప్రదాయం ప్రకారం బహిరంగంగానే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని బైడెన్ పట్టుపట్టారు. అయితే, ఈ సారి ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలోనే జనాన్ని అనుమతించనున్నారు.

అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి దిగిపోతున్న అధ్యక్షుడు రావడం సంప్రదాయం. కానీ, తాను ఈ కార్యక్రమానికి వెళ్లనని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తానని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ముగ్గురు అధ్యక్షులు మాత్రమే తదుపరి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రాకుండా ఉండిపోయారు. అయితే, గత శతాబ్దంలో ఇలా ఎప్పుడూ జరగలేదు.

సాధారణంగా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో జనం వస్తుంటారు. 2009లో ఒబామా మొదటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 20 లక్షల మంది హాజరయ్యారు. కానీ, ఈ సారి ‘చాలా పరిమిత సంఖ్య’లోనే జనాన్ని అనుమతించనున్నట్లు బైడెన్ బృందం తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రెండు లక్షల టికెట్లు అందుబాటులో ఉంచేవారు. అయితే, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి వెయ్యి టికెట్లు మాత్రమే పెట్టారు.

కాపిటల్ భవనం ముందు ఏర్పాటు చేసిన వేదికపై బైడెన్, హారిస్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 1981 నుంచి కొత్త అధ్యక్షులూ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అధికార బదిలీ సంప్రదాయంలో భాగంగా ‘పాస్ ఇన్ రివ్యూ’ కార్యక్రమం కూడా ఈ సారి జరగనుంది. ఈ కార్యక్రమంలో కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో కొత్త అధ్యక్షుడు సైన్యాన్ని పరిశీలిస్తారు. గత కొన్నేళ్లుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో దేశంలోని ప్రముఖ సింగర్స్‌తో షో ఏర్పాటు చేస్తారు. ఈసారి పాప్ స్టార్ లేడీ గాగా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అమెరికా జాతీయ గీతం పాడనున్నారు. ఆ తర్వాత మరో పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ షో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news