ఏపీలో ఎన్నికల సంఘం vs ప్రభుత్వం వార్ కొనసాగుతోంది. తాజాగా నిమ్మగడ్డ మీద జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఓటును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలంటే ఏ నిబంధనలు పాటించాలో తెలియని అసమర్ధుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఆయన విమర్శించారు. ఓటు బదిలీ కావాలంటే ఆ ప్రాంతంలో కనీసం ఆరు నెలలు అయినా నివాసం ఉండాలని, ఇటువంటి అసమర్ధుడికి ఎన్నికల సంఘం కమిషనర్ గా చేసిన ఘనత చంద్రబాబుదని ఆయన అన్నారు.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు, తన సొంత జిల్లా గుంటూరులో నిమ్మగడ్డ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏకగ్రీవాలు జరగకూడదని చెప్పటానికి నిమ్మగడ్డ ఎవరు? అని ప్రశ్నించిన ఆయన స్పీకర్, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి లను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఏకగ్రీవ ఫలితాలను ఆపేసే హక్కు నిమ్మగడ్డకు లేదని ఆయన అన్నారు. నిమ్మగడ్డ సిఖండి అని, మ్యానిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ, చంద్రబాబు పై చర్యలు తీసుకోకుండా మ్యానిఫెస్టోను రద్దు చేయటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.