గోలీలు మాత్రం కాదు ఇవి.. కోడిగుడ్లే.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి పౌష్టికాహారం అందించేందుకు స్కూల్ జరిగే దినాలలో వారం రోజుల పాటు మంచి ఆహారాన్ని అందించే విధంగా మెనూ తయారుచేసి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని ఏజెన్సీలు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడంతో వాళ్లు ఇష్టారాజ్యంగా పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం లో కూడా నాణ్యతలేని కోడిగుడ్లు అందిస్తున్నారు.
కనిగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్లు గోలీల రూపంలో ఉన్నాయి. బరువు సైతం ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువ ఉండటంతో ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. వీటి వల్ల విద్యార్థులకు సంపూర్ణ పోషణ ఏ విధంగా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంపూర్ణ పోషణ అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తుంది. కరోనా కావడంతో ఒకటవ తరగతి నుండి ఏడో తరగతి విద్యార్థులకు ఇళ్లకే గుడ్లు ఇస్తుండగా 8,9,10 చదివేవారికి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఇస్తున్నారు.
వారానికి ఐదు రోజులు పెడుతున్నప్పటికీ వాటి సైజు సాధారణంగా కోడిగుడ్డు కంటే చిన్నగా ఉంటున్నాయి. ఒక గుడ్డు 40 గ్రాములు నుండి 50 గ్రాములు బరువు ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన. అయితే ప్రస్తుతం పాఠశాలలో ఇస్తున్న కోడి గుడ్లు 31 గ్రాములు మాత్రమే ఉంటున్నాయి. ఈ కోడిగుడ్లను చూసి ప్రధానోపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి, పీసీ పల్లి, పామూరు, వెలిగండ్ల, హనుమంతుల పాడు, సిఎస్పురం మండలాలలో పాఠశాలలకు ఇలా తక్కువ బరువు ఉన్న గుట్టను సరఫరా చేస్తున్నారు. తక్కువ బరువున్నవి, ప్రభుత్వ గుర్తింపు లేనివి సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై ఫిర్యాదులు చేస్తున్న వాళ్లు పట్టించుకోవట్లేదని విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ పంపిణీ చేయాల్సి ఉండగా నాలుగు విడతల్లో మాత్రమే ఇస్తున్నారు. కనిగిరి, చాకిరాల, వెలిగండ్ల తదితర ప్రాంతాలలో ఏజెన్సీ దారుడు తోటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గొడవ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కనిగిరి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతీ దేవి అనేక మార్లు ఏజెన్సీ సంబంధించిన వాళ్లతో చెప్పినా ఫలితం లేదని ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. కనిగిరి ఎంఈఓ ప్రసాద్ ఏజెన్సీ వాళ్లతో పలుమార్లు వాగ్వివాదం కూడా చేశారు. తక్కువ పరిమాణం కలిగి ఉన్న కోడి గుడ్లు సరఫరా చేస్తున్న మాట వాస్తవమేనని పలుమార్లు చెప్పినా ఏజెన్సీ వారు పట్టించుకోకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి కోడిగుడ్లు పంపిణీ లో జరుగుతున్న లోపాలను సరిచేసి పిల్లలకు మంచి కోడిగుడ్డును సరఫరా చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కోరుతున్నారు.