రైతులకు పెద్ద మోసం..ధరల స్థిరీకరణ నిధి ఏమైంది : కళా వెంకట్రావు

-

రైతు సంక్షేమాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఖరీప్ సీజన్ మొదలై 2 నెలలు దాటినా ముఖ్యమంత్రి వ్యవసాయంపై సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వైకాపా పాలనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు కరోనా మరింత ఇబ్బందిగా మారిందన్నారు. ఖరీప్, రబీ కలుపుకుని 2019-2020లో 130 లక్షల టన్నుల దిగుబడి లభించగా.. పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి 77 లక్షల టన్నులను మాత్రమే సేకరించిందని తెలిపారు. మిగతా 62 లక్షల టన్నులు దళారులకు, ప్రైవేట్ వ్యక్తులకు తెగనమ్ముకున్నారని అన్నారు.


గత సీజన్​లో మిర్చి నాన్ ఏసీ రకాలకు ధర రూ. 14 వేలు ఉండగా ప్రస్తుతం క్వింటాలు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల రూపాయలకు పడిపోయిందన్నారు. ధరలు లేకపోవటంతో ఒక్క గుంటూరు జిల్లాలోనే 180 కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి పంటను రైతులు దాచుకున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ. 3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. రైతు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇస్తామన్న హామీ ఎక్కడని ప్రశ్నించారు. దాన్యంలో 55 శాతానికే మద్దతు ధర లభించిందన్న కళా.. ప్రభుత్వం సేకరించామంటున్న దాంట్లోనూ నేరుగా రైతుకు కలిగిన ప్రయోజనం శూన్యమని ఆక్షేపించారు. రైతుల పేర్లతో వ్యాపారులు, మిల్లర్లు దళారుల నుంచి పరోక్షంగా సేకరించిందే ఎక్కువని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news