తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాబోతున్న విషయం విదితమే. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను డీఎంకే 133 సీట్లను గెలుచుకుంది. దీంతో స్టాలిన్ సీఎం గా ప్రమాణం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమలహాసన్ తొలిసారిగా పోటీ చేశారు. కానీ ఆరంభంలోనే ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది.
తమిళనాడులోని కోయంబత్తూర్ (సౌత్) నియోజకవర్గం నుంచి కమలహాసన్ పోటీ చేశారు. మక్కల్ నీది మయ్యమ్ పేరిట ఆయన పార్టీ పెట్టగా ఆ పార్టీ గుర్తు టార్చిలైట్‌తో పోటీ చేశారు. అయితే తాజాగా విడుదలైన ఎన్నికల ఫతితాల్లో ఆరంభం నుంచి కమలహాసన్ ఆధిక్యంలోనే ఉన్నారు. కానీ చివరి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ ఆధిక్యం సాధించారు. దీంతో కమలహాసన్‌పై శ్రీనివాసన్ 1500 ఓట్ల తేడాతో గెలిచారు.
అయితే కమలహాసన్ ఓటమిపై ఆయన కుమార్తె, నటి శృతి హాసన్ స్పందించింది. మా నాన్న పట్ల నాకు గర్వంగా ఉంది, ఆయన ఒక ఫైటర్, టర్మినేటర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి ఆ పార్టీ సింబల్ టార్చితో ఓ పోస్టు పెట్టింది. ఇక ఆయన పార్టీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.