సీఎం ఉద్ధ‌వ్‌పై కంగ‌నా అటాక్‌.. 10 త‌ల‌ల రావ‌ణుడితో పోల్చింది..!

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు చెందిన ఆఫీస్‌ను కూల్చివేయ‌డంతో ఆమెకు, ఆ రాష్ట్ర స‌ర్కారుకు మ‌ధ్య ప్ర‌స్తుతం ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. శివ‌సేన పేరు చెబితే కంగ‌నా మండిప‌డుతోంది. ఇప్ప‌టికే శివ‌సేన స‌ర్కారుపై ఆమె అటాక్ ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేపై మ‌రో అస్త్రం సంధించింది. అత‌న్ని ఆమె 10 త‌ల‌ల రావ‌ణుడితో పోలుస్తూ ఓ ట్వీట్ చేసింది.

kangana ranaut depicted cm uddhav as 10 head ravana

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేను కంగ‌నా ర‌నౌత్ 10 త‌ల‌ల రావణుడితో పోలుస్తూ తాజాగా ట్వీట్ చేసింది. ఈ మేర‌కు సీఎం ఠాక్రేకు చెందిన ఓ ఫొటోను ఆమె ట్విట్ట‌ర్ పోస్ట్ చేసింది. అందులో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ న‌టి కంగ‌నాకు ఖ‌డ్గాన్ని అంద‌జేస్తుంటాడు. వెనుక వైపు సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే 10 త‌ల‌ల రావ‌ణాసురుడిలా క‌నిపిస్తుంటాడు. ఆ చిత్రాన్ని ఓ యూజ‌ర్ చిత్రీక‌రించి న‌టి కంగ‌నాకు ట్వీట్ చేయ‌గా.. ఆమె దాన్ని షేర్ చేసింది. దీంతో ఆ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా శివ‌సేన పార్టీ నుంచి బెదిరింపుల‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో కంగ‌నా తండ్రి విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్రం ఇప్ప‌టికే ఆమెకు వై కేట‌గిరి సెక్యూరిటీని క‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే కంగ‌నా సీఎం ఉద్ధ‌వ్‌తో సై అంటే సై అంటోంది. చివ‌ర‌కిది ఎక్క‌డి వ‌ర‌కు దారి తీస్తుందో చూడాలి.