బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా వైరస్ బారి నంచి బయటపడ్డారు. ఆరోసారి జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే కనికా డిశ్చార్జ్ అయినప్పటికీ.. వైద్యుల సూచనలమేరకు 14 రోజులపాటు ఆమె గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. అయితే కనికాకు ఐదోసారి జరిపిన టెస్ట్‌లో కూడా కరోనా నెగిటివ్‌గా వచ్చినప్పటికీ.. మరోసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు భావించారు. వరుసగా రెండు సార్లు జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా నెగిటివ్‌గా తేలడంతో.. ఆమె డిశ్చార్జ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 9న లండన్ నుంచి ఇండియాకు తిరిగివచ్చిన కనికా ఆ తర్వాత కొన్ని పార్టీలకు హాజరయ్యారు. అయితే మార్చి 20న ఆమె జ్వరం, దగ్గుతో బాధపడటంతో పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కనికా హాజరైన పార్టీల్లో పాల్గొన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు కనికాపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయింది.
కరోనా పాజిటివ్ రావడంతో కనికాను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. ఆ తర్వాత కనికాకు నాలుగు సార్లు జరిపిన పరీక్షల్లో కూడా కరోనా పాజిటివ్ రావడంతో.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా కనికా ఆస్పత్రి నుంచి డిశార్జ్ కావడంతో ఆమె కుటుంబంలో ఆనందం నెలకొంది.