ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ప్రజల మనసు దోచుకున్న నాయకుడిగా.. అభివృద్ధికి కేరాఫ్‌గా మారారంటూ యువ నాయకుడు ఆమంచికి మంచి ఇమేజ్ ఉంది. ఆయన రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం ఒక ఎత్తు అయితే… 2014లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్, టీడీపీని ఓడించడం మరో ట్విస్టు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరాం విజయం సాధించారు. దీంతో ఇరు పక్షాల మధ్య సహజంగానే రాజకీయ వైరం ఉంటుంది. ఇదిలావుంటే.. కొన్నాళ్ల కిందట తన కుమారుడి భవిష్యత్తు కోసం.. కరణం.. వైసీపీ పంచన చేరారు. వాస్తవానికి అప్పటికే వైసీపీలో ఉన్న ఆమంచితో ఆయన కలిసి పోవడమో.. లేక డిస్టెన్స్ మెయింటెన్ చేసినా… వివాదాలకు దూరంగా ఉండడమో చేయాలి.
కానీ.. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ ఇవ్వాలని.. ఇప్పటి నుంచి అంటే.. మూడున్నరేళ్ల ముందు నుంచే కరణం.. తన అనుకూల వర్గంతో ప్రచారం చేయిస్తున్నారు. ఇక, అదే సమయంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీత.. తనను నెత్తిన పెట్టుకుని టికెట్ ఇచ్చి.. ఓడిపోతే.. ఎమ్మెల్సీని చేసిన టీడీపీకి నమ్మక ద్రోహం చేసి.. వైసీపీ పంచన చేరిపోయారన్న విమర్శలు మూటకట్టుకున్నారు. ఆమె ఏ కరణంను అయితే నమ్మి వైసీపీలోకి వచ్చారో ఇప్పుడు అదే కరణం ఆమెను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు అటు కరణం బలరాం.. కానీ, ఇటు పోతుల సునీత కానీ.. ఇద్దరి లక్ష్యం చీరాల టికెట్‌ను సంపాయించుకోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ నేతల టార్గెట్ కూడా ఆమంచి కృష్ణమోహనే. అందుకే.. ఇరువర్గాలు ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా.. ఆమంచిని టార్గెట్ చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు చీరాల రాజకీయం రివర్స్ అయ్యి మొదటికే మోసం వచ్చింది. టీడీపీలో జట్టుకట్టి ఆమంచిని ఓడించి.. ఇప్పుడు వైసీపీలోనూ ఆమంచి టార్గెట్‌గా వీరు చేసిన రాజకీయం వికటించి.. వీళ్లలో వీళ్లు తన్నుకునే వరకు వచ్చింది.
ఇక ఆమంచి విషయానికి వస్తే గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా.. ప్రజలకు ఆయన చేరువగానే ఉన్నారు. ఇటీవల మత్స్యకార వివాదమే దీనికి ప్రధాన ఉదాహరణ. ఇక, పేదలకు ఇళ్ల లబ్ధిని చేకూర్చేందుకు తన వంతుగా ఆమంచి ఎంతో ప్రయత్నం చేశారు. నిన్నటి వరకు చీరాలలో ఆమంచి టార్గెట్గా నడిచిన పొలిటికల్ సినిమాలో ఇప్పుడు ఆమంచి హీరో అయితే ఆయన్ను టార్గెట్ చేసిన వాళ్లనే ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి వచ్చేసింది. వీళ్ల రాజకీయం భవిష్యత్తులో ఇంకెంత రంజుగా మారుతుందో ? చూడాలి.