కర్ణాటక సీఎం పదవి నుంచి బీఎస్ యెడియూరప్ప వైదొలిగాక ఆ స్థానంలో కొత్తగా ఎవరు వస్తారా ? అని కర్ణాటక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను ప్రకటించేసింది. యెడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మైని సీఎంగా నియమించింది. దీంతో ఆయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈయనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బసవరాజ్ బొమ్మై పూర్తి పేరు బసవరాజ్ సోమప్ప బొమ్మై. ఈయన కర్ణాటక మాజీ సీఎం, జనతా దళ్ నేత ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 1960 జనవరి 28వ తేదీన జన్మించారు. బసవరాజ్ బొమ్మై ఇప్పటికే యెడియూరప్ప ప్రభుత్వంలో హోం, న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వంటి పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.
బసవరాజ్ బొమ్మై మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. జనతా పరివార్‌లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత 1998లో కర్ణాటక శాసన మండలికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో ధర్వాద్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008 ఫిబ్రవరిలో బసవరాజ్ బొమ్మై బీజేపీలో చేరారు. అప్పట్లో యెడియూరప్ప సీఎంగా ఉన్నారు. తరువాత షిగ్గాన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
వ్యవసాయ రంగంలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన నేతగా బసవరాజ్ బొమ్మైకు పేరుంది. అక్కడ యెడియూరప్ప ప్రభుత్వంలో ఆయన అనేక రకాల ఇరిగేషన్ స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. దేశంలోని తొలిసారిగా 100 శాతం పైప్‌డ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిగి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంగా షిగ్గాన్ మారింది. ఇదంతా బసవరాజ్ బొమ్మై చేసిన కృషే. ఇక సీఎం అయ్యాక తొలిసారిగా స్పందించిన బసవరాజ్ బొమ్మై.. తనపై అతి పెద్ద బాధ్యతను ఉంచారని అన్నారు. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. కాగా యెడియూరప్పకు చాలా సన్నిహితంగా ఉన్నందునే బసవరాజ్ బొమ్మైకు సీఎం పదవి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.