కర్ణాటక వేదికగా జరుగుతున్న మహారాజ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు సెమీఫైనల్ మ్యాచ్ మైసూర్ వారియర్స్ మరియు గుల్భర్గా మిస్టిక్స్ మధ్యన జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ జట్టు నిర్ణీత ఓవర్ లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ స్కోర్ ను చూస్తే ఎవరైనా ఇది వన్ డే మ్యాచ్ నా అన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. అంతలా మైసూర్ ఆటగాళ్లు గుల్భర్గా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ కరుణ్ నాయర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి జట్టుకు ఆసాధారణమైన స్కోర్ ను సాధించి పెట్టాడు. ఇతను తన ఇన్నింగ్స్ లో కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు మరియు 9 సిక్సులతో 107 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇతని ధాటికి గుల్భర్గా బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇతనికి రవికుమార్ సమర్థ్ (80) నుండి చక్కని సహకారం లభించింది. ఇక 249 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న గుల్భర్గా జట్టు పోరాడుతోంది.
ఇక ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న కరుణ్ నాయర్ ను బీసీసీఐ సెలెక్టర్లు కరుణించి మళ్ళీ టీం ఇండియా జాతీయ జట్టులో చోటిస్తారా చూడాలి.