ది కశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలను సృష్టిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకు అనూహ్య స్పందన వచ్చింది. చిన్న సినిమాగా విడుదల అయిన కశ్మీర్ ఫైల్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంది. అయితే ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా వస్తుంది. ఈ సినిమాలో ఒక వర్గం ప్రజలపై వ్యతిరేక భావన కలిగించేలా సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పండిట్ల విషయంలో ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారని ఈ సినిమాలో ఉందని అంటున్నారు.
ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలను తొలగించాలని పలువురు డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ముంబై హై కోర్టులో ఈ సినిమా పై కేసు నమోదు అయింది. కాగ తాజా గా తెలంగాణ హై కోర్టులో కూడా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పై పిటిషన్ వేశారు. కాగ ఈ పిటిషన్ ను హై కోర్టు బుధవారం విచారించింది. పిటిషన్ తరపు న్యాయవాది ఆయా సన్నివేశాలను తొలగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కాగ సెన్సార్ బోర్డు తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్య కరణ్ రెడ్డి వాదిస్తూ.. ఈ సినిమాకు సెన్సర్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. ఎవరికైనా.. అభ్యంతరాలు ఉంటే.. ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలని.. డైరెక్ట్ హై కోర్టులో కాదని అన్నారు. దీనిని హై కోర్టు సమర్థిస్తు.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై జోక్యం చేసుకోలేమని తెల్చి చెప్పింది. అభ్యంతరాలు ఉంటే.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.