డబ్బు.. కష్టాల్లో ఉన్నవాడిని సుఖాల్లోకి.. సుఖంలో ఉన్నవాడిని కష్టాల్లోకి ఇట్టే నెట్టేస్తుంది. ఉన్న బంధాలను తెంచేస్తుంది.. లేని బంధాలను సృష్టిస్తుంది. మంచి వాడిని చెడు మార్గంలోకి.. చెడ్డవాడిని మంచి మార్గంలోకి నడిపించే శక్తి గలది ఈ డబ్బు. తాజాగా ఈ విషయం సుశీల్ కుమార్ జీవితంలో నిజమైంది. బీహార్‌కు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ సుశీల్ కుమార్ 2011 లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో 5 కోట్లు గెలిచి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అంత డబ్బు గెలిచిన తర్వాత సుశీల్ వ్యాపారం పెట్టుకుని మంచి జీవితాన్ని గడుపుతుంటాడని అందరూ భావించి ఉంటారు.
కానీ డబ్బు తనని దురలవాట్లకు దగ్గర చేసిందని, డబ్బు వచ్చాక మద్యం, సిగరెట్ తప్పనిసరిగా మారాయని, అలాగే దగ్గరివాళ్ల చేతిలో మోసపోవడమే కాకుండా భార్యతో సంబంధాన్ని తుంచేసుకునే స్థాయికి చేరుకోవాల్సి వచ్చిందని, కేబీసీలో కోట్లు సంపాదించిన తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్లను సుశీల్ తన ఫేస్బుక్ పేజీలో సవివరంగా వివరించారు.