కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉభయ సభల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అవసరమైతే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో…. పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. ప్రమాదకరమైన కేంద్ర ఆర్ధిక విధానాలపై… ఉభయ సభల్లో గొంతెత్తాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న తీరుపై పార్లమెంటులో నిలదీయాలని సీఎం కేసీఆర్ సూచించారు. గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికమని కేసీఆర్ దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్ర రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్థను.. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న దుర్మార్గ విధానాలను భారాస ఎంపీలు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ చెప్పారు.