తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం హస్తీనాకు వెళ్లనున్నారు. అమరావతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ని ఆహ్వానించేందుకు, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ సమావేశం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుంటే.. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజధాని పర్యటనకు వెళ్తున్నారు.
ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో నిర్వహిస్తోన్న సహస్ర చండీయాగంలో బిజీగా ఉన్నా ఆయన ఢిల్లీలో జరిగే కేంద్రమంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహానికి ప్రత్యేక విమానంలో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు పలువురు జాతీయ నేతలను కలుసుకోవడంతో త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.