బిఆర్ఎస్ ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చని.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టుకోవచ్చు.. అవసరమైతే చైనాలో కూడా పోటీ చేయొచ్చు అని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిఆర్ఎస్ తో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తులు కానీ ఉండవని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటూ.. దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేస్తుందని ఆరోపించారు. విద్యను ప్రైవేటీకరణ చేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. మునుగోడు ప్రజలకు పంచుతున్న కోట్లాది రూపాయలు టిఆర్ఎస్, బిజెపి నేతలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ నుంచి దూరం కాలేదని.. వారిని తిరిగి పార్టీతో కనెక్ట్ చేసేందుకు యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు.