తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి, మందమర్రి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రం లేని పురోగతిని తెలంగాణ సాధించింది, సమైక్య రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వాట్టన్నింటిని కాలదన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. మోదీ, అమిత్‌షాలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. భాజపా అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో వృద్ధులకు రూ. వెయ్యి పింఛను ఇస్తున్నారా? కంటి వెలుగు కార్యక్రమం భారత్‌లో ఎక్కడైనా ఉందా? అవన్నీ నా అంతట నేను అమలు చేశా అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్, భాజపాయేతర ఫెడరల్ ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరుతుందని, అందులో తాను కీలక పాత్ర పోషించనున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో నుంచి మంచి ఆదరణ వచ్చింది… త్వరలోనే ఈఎన్‌టీ వైద్య బృందం కూడా గ్రామాల్లో పర్యటించి ఆయా సమస్యలతో బాధపడే వారికి మందులు అందిస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి బ్లడ్ శాంపిల్స్ సేకరించి వివరాలు ఒక చోట పొందు పరుస్తాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని తన ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పు కోసమే మందస్తు ఎన్నికలకు వచ్చాం.ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం పోరాడిన బాల్క సుమన్‌పై ఎన్నో కేసులు పెట్టారు.సుమన్ ప్రజల కష్టలు తెలిసిన మనిషి ..ఈ సారి సుమన్ని గెలిస్తే, సాధారణ ఎమ్మెల్యేగా ఉండడు. ఉన్నత స్థానంలో ఉంటాడన్నారు. మోదీ, అమిత్ షా లు పచ్చి ఆబద్దాలు మాట్లాడటంలో ముందంజలో ఉన్నారని విమర్శించారు.