తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా ? ఎన్నికలు లేకున్నా.. ఓ వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యేలా వ్యవహరిస్తున్నారా? తాజాగా మారుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగానే కాకుండా.. సాధారణ ప్రజల నుంచి కూడా కేసీఆర్‌కు మద్దతు చాలా అవసరం. ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు లేవు. తెలంగాణలో ఒకటికి మించి ప్రతిపక్షాలు యాక్టివ్‌గా ఉన్నాయి. ఏపీలో ఒక్క టీడీపీకి మాత్రమే.. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది.
కానీ, తెలంగాణలో మాత్రం.. ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలతోపాటు.. కేసీఆర్ మిత్రపక్షం.. ఎంఐఎంకు కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఒకింత వ్యతిరేక గాలులు వీస్తే.. మూకుమ్మడిగా కేసీఆర్‌పై దాడికి ఆయా పార్టీలు రెడీ అవుతున్నాయి. దీనిని కట్టడి చేయడం కేసీఆర్‌కు సాధ్యం కావడం లేదనేది వాస్తవం. ఎప్పుడు వీలైతే.. అప్పుడు అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, కాంగ్రెస్ దూకుడు కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో తనకు అనకూలంగా రాజకీయాలను మార్చుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.
దీనిని గమనించిన కేసీఆర్.. ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగులను తనవైపు పూర్తిగా తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా వారిపై అవసరం లేకున్నా అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులు విధుల్లో చేరిన నాటి నుంచి వారు రిటైర్ అయ్యేవరకు కూడా అన్ని రికార్డులను మెయింటెన్ చేయడంతోపాటు.. వారు రిటైర్ అయినప్పుడు ఒకటి రెండు రోజల్లోనే వారికి అందాల్సిన బెనిఫిట్స్‌ను అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు, ప్రభుత్వ వాహనంలో వారిని రిటైర్ అయిన రోజు ఇంటికి సగౌరవంగా పంపేలా నిర్ణయించారు.
అంతేకాదు.. సన్మాన కార్యక్రమం నిర్వహించేలా కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నిజానికి ఈ తరహా నిర్ణయం తీసుకోవడంలో దేశంలో తెలంగాణ ఒక్కటేనని చెప్పాలి. అయితే, ఈ నిర్ణయం వెనుక ఉద్యోగుల మద్దతును తనవైపు తిప్పుకోవడమేనని వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ వంటి నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక ఖచ్చితంగా తన ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. మరి ఇది ఏమేరకు ఆయనకు ఫలితాన్ని చేకూర్చుతుందో చూడాలి.