తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో అవసరమైతే దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం మొదలయిందన్న ఆయన ఇప్పుడు తెలంగాణా వచ్చాక వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇప్పుడు పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని అన్నారు. అందుకే తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామని అయన అన్నారు.
ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల వివాదం మీద ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని నిన్న ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఫైనల్ చేశారు. మరో పక్క ఏపీ సీఎం కూడా జలవనరులశాఖ ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు చేస్తున్నారు. తమ వాదన సరైనదే అని చెప్పుకునేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సిద్దం చేసుకుంటున్నారు.