అవసరమైతే చస్తా…కానీ పరాయి పాలనలోకి పోనివ్వను..కేసీఆర్

-


అవసరమైతే తెలంగాణ కోసం చావనైనా చస్తా కానీ పరాయి పాలన చేతిలోకి పోనివ్వను అంటూ తెరాస అధినేత కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ..పోరాడి సాధింకున్న తెలంగాణను తన కంఠంలో ప్రాణం ఉండగా, ఎవరికీ బానిసను కానియ్యనన్నారు. తెలంగాణ ప్రజలు విచక్షణతో మరోసారి పోరాడాల్సి ఉంటుందని.. దీంతో ప్రజా కూటమిని తెలివితో దెబ్బ కొట్టాలని సూచించారు. ‘తెలంగాణ కోసం చేసిన పోరాటంలో కోమాలోకి పోతవని డాక్టర్లు హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. ఒక్కరోజు ఆగండి. నాకు దేవుడిపై నమ్మకం ఉందని నాడు డాక్టర్లకు చెప్పా. అదేరోజు రాత్రి కాంగ్రెస్ అధిష్టానం నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చింది. దీంతో కేసీఆర్‌ చావలేదు.. తెలంగాణ వచ్చిందని మీరు సంతోషపడ్డారు. చీకటి అవుతుందని బెదిరింపులు ఎదుర్కొన్న తెలంగాణ నేడు తలసరి విద్యుత్‌ ఉత్పత్తిలో 29 రాష్ట్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. మన వనరులను వినియోగించుకుని అభివృద్ధిలోనూ 17.17 శాతంతో దూసుకెళ్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఆదాయం 9.56 కోట్లు. తెరాస పాలనలో ఇసుక మీద 2057 కోట్ల ఆదాయాన్ని సాధించాం. మైనింగ్‌ కార్పోరేషన చైర్మన్‌ సుభాష్‌రెడ్డి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించి సంపద పెంచారు. మరో టర్మ్‌ అధికారమిస్తే మొత్తం 10 వేల కోట్ల రూపాయాలు ఆదాయాన్ని తెలంగాణకు సాధించిపెడతామన్నారు. సంపద పెంచాలి. పేదలకు పంచాలి. కానీ చంద్రబాబు లాంటి దుర్మార్గుడు విద్యుత్‌ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. నాడు ఎంతో కష్ట పడి తెచ్చుకున్న తెలంగాణను మరో సారి తమ చేతుల్లోకి తీసుకోవడానికి అటు ఢిల్లీ ఇటు అమరావతి ప్రయత్నం చేస్తుందన్నారు. మీరు ఓటు వేసే ముందు ఒక్క సారి ఆలోచించండి అంటూ కేసీఆర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news