అగ్నిపథ్ పథకం కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల రిక్రూట్మెంట్ ప్రక్రియలో కేంద్ర సర్కార్ ఓ కీలక మార్పు చేసింది. ఆర్మీలో చేరాలనుకునే వారికి తొలుత ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటిలో అర్హత సాధించిన వారు సీఈఈకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపై తొలుత సీఈఈని నిర్వహించనున్నారు. దీనివల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలు పడనుంది. స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి వీలుపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్‌లో తొలి విడత సీఈఈ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023-24 రిక్రూట్‌మెంట్‌లో ఆర్మీలో చేరబోయే 40 వేల మందికి ఈ ప్రక్రియ వర్తించనుంది.