కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై ఆయన స్పందించారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఏ ఒక్క వర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట యమదూతగా మారిందన్నారు.
కేసీఆర్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని.. ఆయన సకల జనుల ద్రోహి అని, నయవంచకుడని ఫైర్ అయ్యారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఎంపీ కె. లక్ష్మణ్ తో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తానంటే నమ్మేందుకు ప్రజలు అమాయకులు కారన్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ సీఎం పదవిని చేపట్టి రాష్ట్రంలో అప్పులు, అవినీతితోపాటు అహంకారం పెంచుకున్నారు తప్ప రాష్ట్ర సంపదను మాత్రం పెంచలేదన్నారు.