లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో కొత్త శక్తిగా నిలుస్తుందని, అన్ని లోక్‌సభ స్థానాల్లో తమకు జనం నుంచి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మోదీకి అండగా నిలిచారని, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా తమ పార్టీకి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారంతా ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు.
ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. పోలింగ్ అనంతరం సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని , ముఖ్యమంత్రి రేవంత్ కుటిల యత్నాలను ప్రజలు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు గ్యారంటీలను అమలు చేయాలని, ఆ పార్టీకోసం మజ్లిస్ కార్యకర్తలు పనిచేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదని పేర్కొన్నారు.