పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక సేల్స్ చేసిన వారికి అవార్డ్స్ అందజేశారు.
2017లో 3 వేల జనఔషధీ కేంద్రాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 9,177కు చేరిందన్నారు. జన ఔషధి.. ‘సేవా భీ, రోజ్‌గార్ భీ’ నినాదంతో కేంద్రం ముందుకెళ్తోందన్నారు కిషన్ రెడ్డి. జన ఔషధి కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందన్నారు. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా కేంద్రాలు, మందుల రేట్లు తెలుసుకోవచ్చని వివరించారు. మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనఔషధి కేంద్రాల్లో మందులపై 50 నుంచి 90% తక్కువ ధరకే మందులు లభిస్తాయన్నారు.
కరోనా సమయంలో జన ఔషధి కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. జన ఔషధి కేంద్రాల నిర్వాహకులకు ప్రోత్సాహకం రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు కేంద్రం పెంచిందన్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల్లో 1700 మెడిసిన్స్ ఇస్తున్నారని.. ఈ సంఖ్యను మరింత పెంచుతామని తెలిపారు.