కిషన్‌రెడ్డి ప్రొటోకాల్ కి గండి కొడుతుంది ఎవరు…?

కిషన్‌రెడ్డి. సికింద్రాబాద్‌ ఎంపీనే కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఓ ఎంపీగా సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు.. కేంద్రమంత్రి హోదాలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరచూ వెళ్తుంటారు. ఓ కేంద్రమంత్రి వస్తుంటే దానికి ప్రభుత్వ పరంగా ప్రొటోకాల్‌ ఉంటుంది. సమస్యకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. కానీ.. కిషన్‌రెడ్డి పర్యటనలో తరచూ ప్రొటోకాల్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనిపై టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం కామనైపోయింది.


కేంద్రమంత్రి వచ్చారని ప్రొటోకాల్‌ భాగంగా వెళ్తే.. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో అక్షింతలు తప్పదని భావించి చాలామంది అధికారులు దూరంగా ఉంటున్నారట. దీంతో రాష్ట్ర మంత్రులు పర్యటిస్తే అధికారులంతా వెంట ఉంటారని.. కేంద్రమంత్రిని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు.అయితే కేంద్రమంత్రి వెంట పెద్దస్థాయి అధికారులు ఎవరూ రాలేదు. చిన్నస్థాయి ఉద్యోగులే వచ్చారు. కొన్నిప్రాంతాల్లో వారు కూడా లేరు. దీంతో కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు కిషన్‌రెడ్డి.

కిషన్‌రెడ్డి మాటలపై బీజేపీ కార్యకర్తలు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పోయి.. బతిమాలడం ఎందుకని ప్రశ్నిస్తున్నారట.