తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఎలాంటి వర్గపోరు జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. పైకి అసలు ఏమీ లేనట్టు కనిపించినా కూడా లోలోపల మాత్రం అటు కిషన్‌రెడ్డి ఇటు బండి సంజయ్ వర్గం అన్నట్టు జరుగుతున్నాయి రాజకీయాలు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పటికే బండి సంజయ్ తన ఇమేజ్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి కంటే కూడా బండి సంజయ్‌కే పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఇక ఇప్పుడు బండి సంజయ్‌ను దాటేసి తన ఇమేజ్ పెంచుకునే పనిలో పడ్డారు కిషన్‌రెడ్డి.
అందుకే పార్టీ అధ్యక్షుడిని దాటేసి మరి ఆయన జనాశీర్వాద యాత్రను చేస్తున్నారు. అయతే దీన్ని కాస్తా అసలు బండి సంజయ్‌కు పట్టులేని జిల్లాల్లో చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. రాష్ట్రంలోని తూర్పు జిల్లాలైన నల్లగొండ అలాగే వరంగల్ జిల్లాలే ప్రధాన టార్గెట్ గా కిషన్‌రెడ్డి తన రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ కు పట్టున్న జిల్లాలవైపు వెళ్తే అది తనకు పెద్దగా కలిసి రాదని గ్రహించిన కిషన్‌రెడ్డి వెంటనే తన రాజకీయాలు మార్చుకుని పట్టులేని జిల్లాల్లో తానే పెద్ద దిక్కువగా ఉండాలని చూస్తున్నారు.
కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు తానే దిశానిర్ధేశం చేసే నేతగా కనిపించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అప్పుడే సెకండ్ గ్రేడ్ స్థాయి నేతలు కూడా తన దారిలోకి వస్తారని ఆయన భావిస్తున్నారు. కిషన్‌రెడ్డి ఈ ప్లాన్ వేయడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ మధ్య పార్టీలో ఉంటున్న కీలక నేతంలందరూ కూడా బండి సంజయ్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలతో కార్యకర్తలను తన గుప్పిట్లో పెట్టుకుంటే ఆటో మేటిక్ గా వారంతా కూడా తన వైపు ఉంటారనేది కిషన్‌రెడ్డి ప్లాన్.