టీం ఇండియాను మరోసారి కెఎల్ రాహుల్ ఆదుకున్నాడు. కివీస్ ముందు 297 పరుగుల భారీ టార్గెట్ ఉంచాడు. కష్టాల్లో ఉన్న టీం కి మరోసారి అతను పెద్ద దిక్కు అయ్యాడు. 5వ స్థానంలో వచ్చి జట్టుకి అండగా నిలబడ్డాడు రాహుల్. వివరాల్లోకి భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు తొలుత టీం ఇండియా బ్యాట్స్మెన్ ని కట్టడి చేసినా ఆ తర్వాత తేలిపోయింది.
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, అవుటైనా యువ ఆటగాళ్ళు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ జట్టుని ఆదుకున్నారు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే 63 బంతుల్లో 9 ఫోర్లతో 62 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ నీశం బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి కెఎల్ రాహుల్ హవా మొదలయింది.
అప్పటి వరకు నింపాదిగా ఆడుతూ వచ్చిన రాహుల్ ఒక్కసారిగా కివీస్ బౌలర్ల మీద ఎదురు దాడి చేసాడు. అయ్యర్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు రాహుల్. ఆరో స్థానంలో వచ్చిన మనీష్ పాండే తో కలిసి దాదాపు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుని ఆదుకున్నాడు. 250 పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని భావించిన టీం ఇండియాకు మంచి స్కోర్ అందించాడు.
ఈ క్రమంలో తన కెరీర్ లో వన్డేల్లో నాలుగో సెంచరీ నమోదు చేసాడు. స్కోర్ పెంచే క్రమంలో రాహుల్ 113 బంతుల్లో రెండు సిక్సులు 9 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగ్ లో జామిసేన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనీష్ పాండే 42 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో టీం ఇండియా భారీ స్కోర్ సాధించలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 చేసి 297 పరుగుల లక్ష్యాన్ని కీవీస్ ముందు ఉంచింది.